ప్రత్యర్థులను ఇరుకున పెట్టడంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్టయిలే వేరు. బీఆర్ఎస్ ప్రభావంలోనూ గెలిచి సత్తా చాటిన ఈయన.. అప్పుడప్పుడు సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా మరోసారి ఆయన వివాదాస్పద అంశాలను టచ్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ పై సర్వత్రా చర్చ జరుగుతోంది.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూర్ లో పర్యటించారు జగ్గారెడ్డి. అక్కడ.. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంబేద్కర్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. ఆయన విగ్రహం ప్రతీ గ్రామంలో ఉండాలని చెప్పారు. అంటరానితనాన్ని నిర్ములించాలంటే విద్య ఒక్కటే మార్గమని సూచించారు.
కలియుగం వచ్చాకే కులాలు, మతాల మధ్య గొడవలు మొదలయ్యాయని అన్నారు జగ్గారెడ్డి. హనుమంతుడుకి ఉన్న బలం గురించి చెప్పింది జాంబవంతుడేనని.. ఆయన కూడా ఎస్సీ సామాజిక వర్గమేనని వివరించారు. అలాంటి జాంబవంతుని కూతురు శ్రీకృష్ణుడిని పెళ్లాడిందని చెప్పుకొచ్చారు. ‘‘శ్రీరాముడు, అల్లా మధ్య ఏమైనా పంచాయితీ ఉందా? ఎప్పుడైనా వారు గొడవపడ్డారా? మీరు చూశారా..?’’ అంటూ ప్రశ్నించారు.
అరుంధతి ఎస్సీ సామాజికవర్గమేనని చెప్పిన జగ్గారెడ్డి.. రెడ్డి, బ్రాహ్మణుడు ఎవరైనా సరే పెళ్లి సమయంలో అరుంధతి నక్షత్రం చూడాల్సిందేనన్నారు. అందుకే.. విద్యతో జ్ఞానం వస్తుందని.. అప్పుడే ఎలాంటి విభేదాలు లేకుండా ఉంటాయని చెప్పారు జగ్గారెడ్డి.