త్రిపుర, నాగాలాండ్, మేఘాలయా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నిన్న ప్రకటించబడ్డాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆ రాష్ట్రాల్లో తుడిచి పెట్టుకు పోయిందన్నారు. బైనాక్యులర్‌తో చూసినా అక్కడ కాంగ్రెస్ కనిపించదన్నారు.
ఈశాన్య రాష్ట్రాల్లోకి బీజేపీ ప్రవేశించలేదని గతంలో పలు పార్టీలు చెప్పేవన్నారు. కానీ అక్కడ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందన్నారు. అది ఈశాన్యమైనా, లేదా గుజరాత్,యూపీ, కర్ణాకలోనైనా ప్రతి చోటా ప్రధాని మోడీ మ్యాజిక్ పని చేస్తుందన్నారు.
కర్ణాటకలోని బీదర్‌లో ఆయన పర్యటిస్తున్నారు. ఈ రోజు ఉదయం ఆయన బీదర్ చేరుకున్నారు. అక్కడ ప్రసిద్ద గురునానక్ జీరా సాహిబ్ గురుద్వారాను సందర్శించారు. గురుద్వారాలో ఆయన ప్రార్థనలు చేశారు. రాష్ట్రంలో విజయ్ సంకల్ప్ యాత్రను ఆయన ఈ రోజు ప్రారంభించనున్నారు.
రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బెంగళూరు సేఫ్ సిటీ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆయన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఏడాదిలో కర్ణాటకలో అమిత్ షాకు ఇది ఐదో పర్యటన కావడం గమనార్హం.