కేంద్ర హోం మంత్రిపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయోధ్య రామాలయ ప్రారంభ తేదిపై అమిత్ షా ప్రకటన చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. అమిత్ షా ఒక రాజకీయ నాయుకుడు మాత్రమేనన్నారు. అంతే కానీ పూజారి కాదన్నారు.
దేశాన్ని కాపాడటం, రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వడం మీ కర్తవ్యమని అమిత్ షాకు ఆయన సూచించారు. అంతేకానీ దేవాలయం గురించి ప్రకటనలు చేయడం మీ కర్తవ్యం కాదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హర్యానాలోని పానిపట్ వద్ద భారత్ జోడో యాత్రలో ఆయన పాల్గొన్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిన్న మాట్లాడుతూ… భక్తుల పూజలు అందుకునేందుకు అయోధ్య రామాలయం వచ్చే ఏడాది నాటికి సిద్ధమవుతుందన్నారు. రామాలయం నిర్మాణాన్ని న్యాయస్థానాల ద్వారా కాంగ్రెస్ అడ్డుకుందని ఆయన ఆరోపించారు.
ఈ క్రమంలో అమిత్ షాపై ఖర్గే మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చివేయడంలో బీజేపీ బిజీగా ఉందని ఖర్గే ఆరోపించారు. తమకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉందని పేర్కొన్నారు. బీజేపీవారు పచ్చి అబద్ధాలకోరులని ఖర్గే తీవ్రంగా మండిపడ్డారు.