నరేంద్ర మోడీ 8 ఏళ్ల పాలనా వైఫల్యాలపై కాంగ్రెస్ బుక్ లెట్ ప్రచురిస్తోంది. 8 ఏళ్లు.. 8 మోసాలు పేరుతో మోడీ పాలనలో వైఫల్యాలను ప్రచురించి.. ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్.
మోడీ పదే పదే అచ్ఛేదిన్ అంటూ ప్రచారం చేస్తున్నారని.. అసలు ఈ అచ్ఛేదిన్ ఎవరికి వచ్చాయో చెప్పాలని కాంగ్రెస్ నేతలు రణదీప్ సూర్జేవాలా, అజయ్ మాకెన్ డిమాండ్ చేశారు. బ్యాంకులను మోసం చేసిన వారికే అచ్ఛేదిన్ వచ్చిందని, ఓటు వేసిన ప్రజలకు ఏమీ రాలేదని అజయ్ మాకెన్ ఎద్దేవా చేశారు.
మోడీ పాలన అంతా మోసమేనని ఆరోపించారు. ప్రజలకు చేసిందేమీ లేదని విరుచుకుపడ్డారు. నిత్యావసర ధరలతో పాటు.. అన్ని ధరలను పెంచేసి దేశ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
ఈ 8 ఏళ్లలో పెట్రో, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం విధించి.. 27 లక్షల కోట్ల రూపాయలను ఆర్జించుకుందని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాల విషయంలోనూ ప్రజలను మోసమే చేసిందని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు.