ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీ
అత్యంత దయనీయ పరిస్థితులలో రెండు నెలలుగా బురద నీటిలో విల విలాడుతూ తీవ్రమైన బాధలు అనుభవిస్తున్న దారుణమైన పరిస్థితులలో ఉన్న ఉస్మాన్ నగర్, సయిఫ్ నగర్, అబ్దుల్లా యహియా నగర్ వాసుల బాధలను మీ దృష్టికి తెస్తున్నాను. గత రెండు నెలల క్రితం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో లో కురిసిన వర్షాలతో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజక వర్గం లోని జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీలు పూర్తిగా మునిగిపోయాయి. రెండు నెలలుగా అవుతున్న అక్కడ నీటిని తరలించకపోవడంతో మూడు కాలనీల్లో దాదాపు 1000 ఇళ్లల్లో సుమారు 5 వేల మంది దుర్బర జీవితాన్ని అనుభవిస్తున్నారు. మధ్య తరగతి, పేద ప్రజలు నివసిస్తున్న ఈ కాలనీలో దాదాపు
వెయ్యి ఇల్లు మునిగిపోయి నిత్యావసర వస్తువులు, బియ్యం, ఎలక్ట్రానిక్ వస్తువులు టివి, ప్రిడ్జి, కంప్యూటర్లు, పిల్లల పుస్తకాలు, బెడ్స్, చెక్క వస్తువులు, ఇల్లు పూర్తిగా పాడయ్యిపోయాయి.
పైసా పైసా కూడ గట్టుకొని గూడు కట్టుకొని కిస్తీల మీద వస్తువులు కొనుక్కోని జీవిస్తున్న సగటు జీవి బతుకు అక్కడ చిన్నాభిన్నం అయ్యింది. పసి పిల్లలు, వృద్దులు, పేదలు తినడానికి తిండి లేక, మందులు లేక, విపరీతమైన దుర్గాంగం, దోమలు, పాములతో సహవాసం చేస్తూ నరకం అనుభవిస్తున్నారు. ప్రైవేట్ ఉద్యోగాలు పోయి యువత ఉపాధి లేకుండా ఉన్నారు. బతకడమే వారికి అక్కడ భారంగా మారిపోయింది. ఒకవైపు కరోనో, మరోవైపు డెంగ్యూ జ్వరాలతో, వ్యాధులతో ప్రజలు నానా కష్టాలు అనుభవిస్తున్నారు. అక్కడ ప్రజలను ఆదుకోవడానికి ఏ అధికారి, ప్రజా ప్రతినిధులు ముందుకు రాలేదు. ఇంత పెద్ద వ్యవస్థ ఉండి హైదరాబాద్ కు కూత వేటు దూరంలో ఉన్న ఒక మంత్రి నియోజక వర్గంలో పరిస్థితి ఇంత దారుణంగా ఉండడం మీ పాలనా తీరుకు నిదర్శనం. మున్సిపాలిటీ, నీటి పారుదల, రెవిన్యూ, విద్యుత్ శాఖల మధ్య సమన్వయ లోపం ఈ ప్రాంత ప్రజలకు శాపంగా మారాయి. అక్కడ నీటిని బయటకు తరలించాలంటే మూడు ఫేస్ ల కరెంట్ అవసరం, నీటి పారుదల కాలువలు క్లియర్ చేయాలి. ఈ పనులు రెండు నెలలుగా చేయకపోవడం వల్ల ప్రజలు మురుగు నీటిలోనే ఉంటున్నారు.
తెలంగాణలో మనం దసరా, దీపావళి పండుగలు చేసుకుంటూ ఆనందంగా ఉంటే అక్కడి ప్రజలు తీవ్రమైన దుఃఖంలో జీవితాలు గడుపుతున్నారు. అధికారులను, కలెక్టర్ లను అడిగితే తాము ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాము, నిధులు మంజూరు కాగానే పనులు చేస్తాం అంటున్నారు. ఇప్పటికైనా మీరు ఆ ప్రాంతంపైన ప్రత్యేక దృష్టి సారించి, యుద్ధప్రాతిపదికన వెంటనే నీటిని తరలించే పనులు చేపట్టాలి. ఇళ్లల్లో జరిగిన ప్రతి నష్టాన్ని అంచనా వేసి ప్రతి ఇంటికి లక్ష రూపాయల నుంచి 5 లక్షల వరకు నష్టపరిహారం అందించాలి, చనిపోయిన కుటుంబాలకు 20 లక్షల రూపాయల నష్ట పరిహారం అందించాలి. మళ్ళీ నీరు నిలువ ఉండకుండా పటిష్టమైన, ప్రణాళిక బద్ధమైన పనులు చేపట్టాలి, ఆక్రమణలను తొలగించి నీరు కిందికి పోయే విదంగా చర్యలు తిడుకోవాలి. వ్యాధుల బారిన పడ్డ వారికి మెరుగైన వైద్యం అందించేందుకు పూర్తి స్థాయిలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలి. వరద బాధితులకు జరిగిన ప్రతి అంశాన్ని నష్టాన్ని అంచనా వేసి బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాను..