తిరువనంతపురం,తొలివెలుగు: బంగారం అక్రమ రవాణా కేసులో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఇదే డిమాండ్ తో కాంగ్రెస్ యువజన కార్యకర్తలు తిరువనంతపురంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ఈ కేసులో పినరయి రాజీనామా చేయాలంటూ సచివాలయం ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యానన్లను ప్రయోగించారు.
అటు.. ఇదే అంశంపై కొచ్చిలో బీజేవైఎం నేతలు సైతం ఆందోళనకు దిగారు. ఇక ఈ కేసులో జూన్ 22న విచారణకు హాజరు కావాలని నిందితురాలు స్వప్నకు ఈడీ సమన్లు పంపింది. మరోవైపు ఈనెల 13న ముఖ్యమంత్రి విజయన్ కు ఊహించని ఘటన ఎదురైంది.విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఇద్దరు యూత్ కాంగ్రెస్ నేతలు నల్ల చొక్కాలు ధరించి,సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
దీంతో ఎల్డీఎఫ్ కన్వీనర్ ఈపీ జయరాజన్ అప్రమత్తమయ్యారు.ఆ ఇద్దరు యూత్ కాంగ్రెస్ నేతలను జయరామన్ వెనక్కి నెట్టేశారు.దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కేరళలోని కన్నూర్ నుంచి తిరువనంతపురం వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.