ఓయూకి రాహుల్ గాంధీని తీసుకొచ్చే విషయంలో కాంగ్రెస్ నేతలు అన్నివిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరునూరైనా రాహుల్ ను ఓయూకి తీసుకొస్తామని హస్తం నేతలు చెబుతుంటే.. ఎలా వస్తారో చూస్తామని టీఆర్ఎస్ సవాల్ చేస్తోంది. ఇరు పార్టీల నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. ఈ క్రమంలో మరోసారి హైకోర్టును ఆశ్రయించారు ఎన్‌ఎస్‌యూఐ నేతలు.
హౌస్ మోషన్ విచారణకు అనుమతివ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. రాహుల్ ముఖాముఖికి ఓయూ అనుమతి నిరాకరించడం కరెక్ట్ కాదని కోర్టుకు తెలిపారు. ఆడిటోరియంలో కార్యక్రమం నిర్వహిస్తే.. ఉద్యోగ సంఘాల ఎన్నికలు, పరీక్షలకు ఆటంకం ఉండదని ధర్మాసనానికి వివరించారు. ఓయూలో విద్యార్థులతో రాహుల్ ఇంటరాక్షన్ కు అనుమతివ్వాలని కోరారు.
ఈ నెల 6న తెలంగాణ పర్యటనకు వస్తున్నారు రాహుల్. ఆరోజు వరంగల్ లో జరిగే రైతు సంఘర్షణ సభకు హాజరవుతారు. 7న పార్టీ నేతలతో సమావేశాలు ఉంటాయి. అదేరోజు ఆయన్ను ఉస్మానియాకు తీసుకెళ్లాలని ప్లాన్ చేశారు కాంగ్రెస్ నేతలు. కానీ.. వీసీ అనుమతి నిరాకరిస్తున్నారు. ఈ విషయంలో విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నాయి.
Advertisements
కాంగ్రెస్ నేతలు కూడా ప్రభుత్వానికి ఎందుకంత భయమంటూ మండిపడుతున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుపై విమర్శలు గిప్పిస్తున్నారు. స్వరాష్ట్ర ఉద్యమ ఆకాంక్షలను ఏళ్ల తరబడి సజీవంగా ఉంచిన ఓయూ జీవచ్ఛవాన్ని తలపిస్తోందని ట్వీట్ చేశారు. శత వసంతాల సామాజిక చైతన్య వేదిక సమాజానికి దూరమై ఒంటరితనాన్ని అనుభవిస్తోందన్నారు. ఓయూలో భావ ప్రకటనా స్వేచ్ఛనే కాదు.. ప్రజాస్వామ్యాన్ని కూడా ప్రభుత్వం హత్య చేస్తోందని. ఇది మేథావుల ఆందోళన అంటూ ట్వీట్ చేశారు రేవంత్.