ఉదయ్ పూర్ ఘటన విషయంలో బీజేపీపై కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రియాజ్ బీజేపీ సభ్యుడని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. కన్హయలాల్ హత్య కేసును ఎన్ఐఏకు కేంద్రం అప్పగించడంపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేసింది.
ఉదయపూర్ ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగుచూశాయని కాంగ్రెస్ మీడియా విభాగం చీఫ్ పవన్ ఖేరా అన్నారు. కన్హయ్య హంతకుల్లో ఒకరైన రియాజ్ అక్తరీ రాజస్థాన్ బీజేపీ మైనారిటీ సెల్ లో కీలక సభ్యుడని ఆయన ఆరోపించారు.
బీజేపీ నేత, రాజస్ధాన్ మాజీ హోంమంత్రి గులాబ్ చంద్ కటారియా పాల్గొన్న కార్యక్రమాల్లో కూడా నిందితుడు రియాజ్ తరుచూ పాల్గొంటూ ఉండేవాడని , వాటికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయని తెలిపారు.
హంతకులు బీజేపీకి చెందిన వారని, అందుకే కేసును తొక్కి పెట్టేందుకే దర్యాప్తును ఎన్ఐఏకు కేంద్రం అప్పగించిందని ఆయన విమర్శలు చేశారు. దీన్ని బీజేపీ ఖండించింది. కాంగ్రెస్ కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తోందని బీజేపీ పేర్కొంది.