తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలపై దళిత సంఘాలు, ప్రతిపక్షాల నాయకులు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సీఎం దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు. కేసీఆర్ దళితులకు క్షమాపణలు చెప్పాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ నేతలు ఎక్కడ కనిపిస్తే అక్కడ అడ్డుకుంటున్నారు.
మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ని జవహర్ నగర్ లో అడ్డుకున్నారు కాంగ్రెస్ నేత సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. ఆయనతోపాటు మరో 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. పోలీసులు వారందరినీ అరెస్ట్ చేశారు. అలాగే బీజేపీ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
కాంగ్రెస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కార్యకర్తలు ధర్నాకు దిగారు. సింగిరెడ్డిని, ఇతర నాయకులను విడుదల చేయాలని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేపట్టారు. బీజేపీ కార్యకర్తలు కూడా ధర్నాలో పాల్గొన్నారు.
ఇక మేడ్చల్ యువమోర్చా అధ్యక్షుడు పవన్ రెడ్డి కూడా కేటీఆర్ కాన్వాయ్ ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఉప్పల్ నల్ల చెరువు దగ్గర యువమోర్చా శ్రేణులు కేటీఆర్ కారును అడ్డగించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ఉప్పల్ పీఎస్ కు తరలించారు.