బడ్జెట్ పై ఉభయ సభల్లో సాధారణ చర్చ మొదలైంది. శాసన సభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేసి నేరుగా బడ్జెట్ పై చర్చ చేపట్టారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల అనంతరం బడ్జెట్ పై చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 2023-2024 ఆర్థిక సంవత్సరానికి వార్షిక ప్రణాళికను సోమవారం ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే.
ఇక చర్చలో మొదటగా ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ఆంక్షలు విధిస్తూ తెలంగాణ ప్రగతిని అడ్డుకుంటోందని ఓవైసీ ఆరోపించారు. అసెంబ్లీలో బడ్జెట్ పై సాధారణ చర్చను ప్రారంభించిన అక్బరుద్దీన్.. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు నిధులు రావట్లేదని తెలిపారు. బడ్జెట్ అంచనాల్లో 20 శాతం లోపు మాత్రమే గ్రాంట్ ఇన్ ఎయిడ్ వస్తోందని వెల్లడించారు.
మిగులు బడ్జెట్ ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కల వల్ల రెవెన్యూ లోటు భర్తీ నిధులు విడుదల కావడం లేదని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కచ్చితమైన లెక్కలు చూపి.. రెవెన్యూ లోటు నిధులు పొందాలని సూచించారు.ఇక ఇలా ఉంటే.. ఒక పార్టీ భారత్ లో రెండు దేశాలను సృష్టిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి రెండుగా విభజిస్తున్నారని వెల్లడించారు.
పేదలు పేదలుగానే ఉంటే..ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారని తెలిపారు. ఈ దేశం దోపిడీకి గురవుతోందని జోడోయాత్రలో రాహుల్ గాంధీతో ప్రజలు అన్నారని వెల్లడించారు. అదానీ అనే వ్యాపారి దేశ సంపదను లూటీ చేస్తున్నారని ఆరోపించారు.