కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని పదవి నుంచి తొలగించాలంటూ ప్రధాని మోడీని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. మరణించిన వ్యక్తికి సంబంధించిన పత్రాలతో బార్ లైసెన్స్ ను కేంద్ర మంత్రి కూతురు రినివల్ చేయించుకున్నారని ఇటీవల ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గోవా ఎక్సైజ్ అధికారులు జోయిష్ ఇరానీకి షోకాజ్ నోటీసులు వచ్చాయని వార్తలు వినిపించాయి.

ఈ క్రమంలో స్మృతి ఇరానీపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఆమెను కేంద్ర కేబినెట్ నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. జోయిష్ ఇరానీపై వస్తున్న వార్తలను ఆమె తరఫు న్యాయవాది ఖండించారు. గోవాలోని సిల్లీ సోల్స్ రెస్టారెంట్ కు తన క్లైంట్ యజమాని కాదని ఆయన అన్నారు.
అసలు ఆమె ఆ రెస్టారెంట్ నడపడం లేదన్నారు. ఆమెకు ఎక్సైజ్ అధికారుల నుంచి ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. తమ క్లైంట్ తల్లి ప్రముఖ రాజకీయ నాయకురాలైనందున కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం తమ క్లయింట్, ఆమె తల్లికి పరువునష్టం కలిగించేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారని ఆయన అన్నారు.
అవన్నీ నిరాధారమైన ఆరోపణలని ఆయన పేర్కొన్నారు. వాస్తవాలను గుర్తించకుండా తమ క్లయింట్ పరువుకు నష్టం కలిగించేందుకు ముందే నిర్ణయించుకున్న లక్ష్యంతో కొందరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. కేంద్ర మంత్రి కూతురైనందుకు మాత్రమే సంచలనాల కోసం కొందరు ఇలాంటి పనులు చేస్తున్నారని ఆయన తెలిపారు.