మంత్రి మల్లారెడ్డిని అడ్డుకున్నారు కాంగ్రెస్, బీజేపీ నేతలు.
దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని శశాంక్ ఎన్ క్లేవ్ లో సీసీ కెమెరాల ప్రారంభోత్సవం నిమిత్తం ఆదివారం దమ్మాయిగూడ కు వచ్చిన మంత్రిని అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు దమ్మాయిగూడ చౌరస్తాలో మోహరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో మంత్రి దమ్మాయిగూడ చౌరస్తా మీదుగా కాకుండా నాగారం చౌరస్తా మీదుగా కృష్ణ థియేటర్ సమీపంలో సీసీ కెమెరాలను ప్రారంభించిన వెళ్ళిపోయారు. అప్పటికే చౌరస్తాలో వేచి ఉన్న కాంగ్రెస్, బీజేపీ నేతలకు విషయం తెలియడంతో కృష్ణ థియేటర్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న కొందరు నేతలను అదుపులోకి తీసుకున్నారు.
కొంతమందిని దమ్మాయిగూడ చౌరస్తాలోని అదుపులోకి తీసుకోగా మరికొంతమందిని కృష్ణ థియేటర్ వద్ద అదుపులోకి తీసుకొని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో రాచరిక పాలన కొనసాగుతుందని ధ్వజమెత్తారు. కృష్ణ థియేటర్ వద్ద మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏనుగు సంజీవరెడ్డి, సామల శ్రీనివాస్ రెడ్డి, ముప్ప రామారావు, బిజెపి నాయకులు గాలి సంపత్ యాదవ్ లను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.
మంత్రి వైఖరిని నిరసిస్తూ దమ్మాయిగూడ చౌరస్తా లో బిజెపి నాయకులు ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షుడు మోర నాగ మల్లారెడ్డి, వి. శాంతి రెడ్డి, దోంకెన రవీందర్ రెడ్డి, శ్రవణ్ కుమార్, సునీల్ చారి, సాహితీ సుజాత, శోభా, మధుసూదన్, బలరాం సింగ్ తదితరులు పాల్గొన్నారు.