మధ్యప్రదేశ్ లోని రట్లంలో ఈనెల 4, 5 తేదీల్లో బీజేపీ నిర్వహించిన 13 వ మహిళా బాడీ బిల్డింగ్ పోటీల్లో కండలు తిరిగిన మహిళలు తమ బాడీ సౌష్టవాన్ని ప్రదర్శించారు. అయితే హనుమంతుని చిత్రపటం ముందు ఈ పోటీలు సాగడం పెను వివాదానికి దారి తీసింది. స్థానిక కాంగ్రెస్ నేతలు దీన్ని అపచారంగా పేర్కొంటూ ఈ స్థలాన్ని పరిశుద్ధం చేసేందుకు గంగాజలాన్ని అక్కడ చల్లి.. హనుమాన్ చాలీసాను పఠించారు.
ఈ పోటీలకు ఆహ్వానితులుగా నగర బీజేపీ మేయర్ ప్రహ్లాద్ పటేల్, ఎమ్మెల్యే చైతన్య కశ్యప్ కూడా హాజరయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీరంతా ఇక్కడ ఇలా మహిళా బాడీ బిల్డర్ల అసభ్య చేష్టలకు కారణమయ్యారని, దేవుని చిత్ర పటం ముందు ఈ పోటీలేమిటని జిల్లా యువజన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మయాంక్ జట్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇందుకు కారకులైనవారిని హనుమంతుడు శిక్షిస్తాడని శాపనార్థాలు పెట్టారు. అయితే క్రీడల్లో మహిళలు రాణించడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని, ఈ పోటీల్లో జరిగిన అపచారం ఏమీ లేదని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి హితేష్ బాజ్ పాయ్ అన్నారు. కాంగ్రెస్ నేతలపై చర్య తీసుకోవాలని కోరుతూ ఈ పోటీల నిర్వాహకుల్లో కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటూ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నుంచి క్షమాపణ కోరారు. మీ జన్మ దినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ ఈవెంట్ హిందువులను, హనుమంతుడిని అవమానపరిచినట్టేనని మేము భావిస్తున్నామని ఆయన అన్నారు.