టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీకి మంత్రి కేటీఆర్ కారణమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంలో చిన్న చేపలను బలి చేస్తున్నారని, చైర్మన్, బోర్డు మెంబర్లు, కేటీఆర్, కేసీఆర్ తప్పించుకుంటున్నారని ఆయన ఆరోపణలు చేశారు. కేటీఆర్‌ను ఎందుకు మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయకూడదని ఆయన ప్రశ్నించారు.
కామారెడ్డి జిల్లా రాజంపేట స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. పరీక్ష పేపర్ లీకేజ్‌కు మంత్రి కేటీఆర్ కారణమన్నారు. బిడ్డ కోసం మంత్రులను కేసీఆర్ ఢిల్లీకి పంపించారన్నారు. కానీ పేపర్ లీకేజీపై ఎందుకు సమీక్షించలేదు? అని ప్రశ్నించారు.
ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరికి నిరసనగా అన్ని మండల కేంద్రాల్లో రేపు సీఎం కేసీఆర్, కేటీఆర్ బొమ్మలను దహనం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వ్యవహారంపై ఈ నెల 22న కాంగ్రెస్ ముఖ్య నేతలంతా కలిసి గవర్నర్ ను కలుస్తామన్నారు. బీఆర్‌ఎస్ , బీజేపీల కుమ్మక్కుపై అమీతుమీ తేల్చుకుంటామన్నారు.
నిరుద్యోగుల జీవితాలు ఆగమవుతున్నాయని మండిపడ్డారు. అయినా గవర్నర్ ఎందుకు సమీక్షించడం లేదు? అంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. తక్షణమే కేటీఆర్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. టీఎస్ పీఎస్సీ సభ్యులను రాజీనామా చేయించాలన్నారు.
లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో, లేదా సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. రాష్ట్రంలో ఎంసెట్, ఏఈ, సింగరేణి, విద్యుత్ శాఖ, గ్రూప్-1 పేపర్లు లీక్ అయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో ఏ పరీక్షలు చూసినా పేపర్ లీకులే అంటూ ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.