హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలను రాజస్థాన్ కి కాకుండా చండీగఢ్ తరలించేందుకు పార్టీ యత్నాలు ప్రారంభించింది. కొత్తగా ఎన్నికైన వీరంతా సాధ్యమైనంత త్వరగా దగ్గరలోని చండీగఢ్ వెళ్లాలని పార్టీ నాయకత్వం కోరినట్టు తెలుస్తోంది. బీజేపీ తమ సభ్యులను ఎగరేసుకుపోకుండా తక్షణమే వీరినందరినీ అక్కడికి చేర్చాలని నేతలు భావిస్తున్నారు.
అధికారుల నుంచి తమ సర్టిఫికెట్లు అందుకున్న వెంటనే ఎమ్మెల్యేలు బస్సుల్లో అక్కడికి తరలి వెళ్లాలని, మొహాలీలోని ఫైవ్ స్టార్ హోటల్ కి చేరుకోవాలని సూచించినట్టు తెలిసింది. వీరి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను అక్కడ ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బాఘేల్, పార్టీ సీనియర్ నేత భూపేందర్ సింగ్ హుడా నిర్ణయిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
అక్కడే కొత్త సిఎల్ఫీ నేతను కూడా ఎంపిక చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. కొత్త నేతను ఎంపిక చేసే బాధ్యతను సీనియర్ నేత రాజీవ్ శుక్లాపై పెట్టారు.
హిమాచల్ సీఎం జైరాం ఠాకూర్ రాజీనామా చేసి.. ఆ లేఖను గవర్నర్ కు సమర్పించారు. ఎన్నికల్లో తమ పార్టీ ఓటమిని ఆయన అంగీకరించారు. కాంగ్రెస్ పార్టీని అభినందించారు. . హిమాచల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 40 సీట్లను గెలుచుకోగా బీజేపీ 25 స్థానాలను దక్కించుకుంది. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రధాని మోడీ.. ఈ రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మీరు బీజేపీకి కూడా మద్దతు ప్రకటించారని, రానున్న కాలంలో ఈ రాష్ట్ర ప్రయోజనాలకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.