కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాత్ర భారత్ జోడో యాత్ర. ఈ యాత్ర జనవరి 30వ తేదీన శ్రీనగర్ లో ముగియనుంది. దీంతో ఈ ముగింపు సభకు హాజరుకావాల్సిందిగా 21 పార్టీలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే లేఖ రాశారు. బీజేపీ మిత్రపక్షాలతో పాటు వైసీపీ, ఎంఐఎం, ఏఐయూడీఎఫ్, బీజేడీ, జేడీఎస్, బీఆర్ఎస్, ఆప్ లకు ఖర్గే ఆహ్వానం పంపలేదు.
రాహుల్ 3,300 కిలో మీటర్ల భారత్ జోడో యాత్రలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, సామాజిక విభజన, ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరచడం, సరిహద్దుల్లో ముప్పు వంటి అంశాలపై జోడో యాత్రలో కాంగ్రెస్ పార్టీ లేవనెత్తింది. అలాగే పలు రంగాలకు చెందిన వారు ఎదుర్కొంటున్న అంశాలపై దేశ వ్యాప్త చర్చకు జోడో యాత్ర శ్రీకారం చుట్టింది.
ప్రస్తుతం భారత్.. ఆర్థిక, సామాజిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్నారు. పార్లమెంటు, మీడియాలో ప్రతిపక్షాల గొంతును కేంద్ర ప్రభుత్వం నొక్కుతోందన్నారు. యాత్ర ముగింపు కార్యక్రమాన్ని జాతిపిత మహాత్మాగాంధీకి అంకితం చేస్తున్నట్లు మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. ప్రస్తుత పాలకులు ప్రజా సమస్యలు ఒక పద్ధతి ప్రకారం పక్కదారి పట్టించారని ఆయన విమర్శించారు.
దేశంలో ద్వేషం, హింస పెంచి పోషిస్తున్నారని కేంద్రంపై విరుచుకుపడ్డారు. వీటన్నింటి నుంచి దేశ ప్రజలను బయటకు తీసుకువచ్చి చైతన్య పరిచేందుకే జోడో యాత్ర నిర్వహించినట్లు పేర్కొన్నారు మల్లిఖార్జున ఖర్గే.