కాంగ్రెస్ ‘చింతన్ శివిర్’రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈరోజు మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు కొనసాగనుంది.
సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులను ఉద్దేశించి ఈ నెల 15న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. వచ్చే ఏడాది రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కార్యక్రమంలో భాగంగా ఈ నెల 16న షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల ర్యాలీని నిర్వహించనున్నారు.
‘మా సంస్థాగత నైపుణ్యం, సామర్థ్యాలను సమీక్షించుకోవడంతో పాటు సవాళ్లకు అనుగుణంగా మమల్ని మేము మార్చుకోవాలని భారతదేశం ఆశిస్తున్నదని మాకు తెలుసు’అని కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా అన్నారు.
ఈ సందర్భంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపెరుగుదలపై కేంద్రాన్ని సూర్జేవాలా తీవ్రంగా విమర్శించారు. ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో సామాన్యుల జీవితం నరక ప్రాయంగా మారిందన్నారు. 2014లో గృహావసర గ్యాస్ ధర రూ. 410 గా ఉండేదన్నారు.
కానీ ఇప్పుడు సిలిండర్ ధర రూ. 1,000కి చేరిందన్నారు. 2014లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 71 ఉండగా ఇప్పుడది రూ. 105కు చేరుకుందన్నారు. డీజిల్ ధర లీటరుకు రూ. 56 నుంచి నేడు రూ. 96.67 దాటిందన్నారు. పెట్రోల్, డీజిల్పై పన్ను విధించి మోడీ సర్కార్ రూ. 27 లక్షల కోట్లు సంపాదించిందన్నారు.