ఇటీవలి కాలంలో ఇండిగో విమానాలు ఏదో ఒక విధంగా వార్తల్లో ఉంటున్నాయి. గత డిసెంబరు 10 న చెన్నై నుంచి తిరుచ్చిరాపల్లి వెళ్ళబోతున్న విమానంలో ఎవరో ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచిన ఉదంతంపై విచారణకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశించింది. అయితే ఆ వ్యక్తి ఎవరన్నది అప్పుడు స్పష్టం కాలేదు. ఆ వ్యక్తి మరెవరో కాదని, బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అని తాజాగా తెలిసింది. ఆయన చర్య ఫలితంగా నాడు రెండు గంటలపాటు విమానం ఎయిర్ పోర్టులోనే నిలిచిపోయింది.
బెంగుళూరు సౌత్ లోక్ సభ నియోజకవర్గ ఎంపీ అయిన తేజస్వి సూర్యే ఈ పని చేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతుండగా.. కాంగ్రెస్ పార్టీ .. దీన్ని హైలైట్ చేస్తూ.. ఆయన ‘అనుచిత చర్య’ను తప్పు పట్టింది. ఈ పార్టీ సీనియర్ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలా..ఇలా చేయడానికి ఈ బీజేపీ ఎంపీకి ఎంత ధైర్యం అని ట్వీట్ చేశారు.
బీజేపీ వీఐపీ బ్రాట్స్ అని అభివర్ణిస్తూ .. ఇలాంటివారిపై ఫిర్యాదు చేయడానికి ఈ ఎయిర్ లైన్స్ కి దమ్ములున్నాయా అని వ్యంగ్యంగా సెటైర్ వేశారు. . ప్రయాణికుల భద్రతతో అది రాజీ పడుతోందా అని ప్రశ్నించారు. అయితే తన చర్యపై విమర్శలు వెల్లువెత్తడంతో తేజస్వి సూర్య ఆ తరువాత ఇండిగో ఎయిర్ లైన్స్ కి, ప్రయాణికులకు లిఖిత పూర్వకంగా క్షమాపణ చెప్పారని తెలిసింది.
మొదట ఏదో ఆలోచనతో తన ఫ్రెండ్ అలా చేశాడని, ఆ తరువాత ఈ ఉదంతానికి సంబంధించి వివరాలు తెలిపేందుకు భయపడ్డారని హఫీజ్ అనే వ్యక్తి తెలిపారు. తేజస్వి సూర్య తరపున తాను ఈ సమాచారాన్ని షేర్ చేస్తున్నానన్నారు. ఇప్పుడు సూర్యపై ఇండిగో ఎయిర్ లైన్స్ ఎలాంటి చర్య తీసుకుంటుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.