అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో తమిళనాడులో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఆ రాష్ట్రంలో పొలిటికల్ షోలు చేస్తున్నా.. ప్రధాన పోటీ మాత్రం ఈసారి కూడా అన్నాడీఎంకే, డీఎంకే మధ్యే ఉండనుంది. దీంతో అన్నాడీఎంకే వైపు బీజేపీ, డీఎంకే వైపు కాంగ్రెస్ నిలబడి ఇన్‌డైరెక్ట్ ఫైట్ చేస్తున్నాయి. ఈ మేరకు ఆయా పార్టీలతో పొత్తులు కుదుర్చుకోగా.. సీట్ల సర్దుబాటు మొత్తానికి కొలిక్కి వచ్చేసింది.
డీఎంకే.. కాంగ్రెస్, సీపీఐలను కలుపుకొని పోటీకి దిగుతోంది. ఈ మేరకు ఆయా పార్టీలకు సీట్లు కేటాయింపును కూడా మొత్తానికి పూర్తి చేసింది. కాంగ్రెస్‌కు 25 సీట్లు ఇచ్చేందుకు డీఎంకే అంగీకారం తెలిపింది. అటు ఇప్పటికే సీపీఐకి 6 స్థానాలను డీఎంకే కేటాయించింది. ఈ మేరకు అంగీకార పత్రాలపై రెండు పార్టీలకు చెందిన ప్రతినిధులు సంతకాలు చేశారు.
తొలుత కాంగ్రెస్ 30 సీట్లను ఇవ్వాలని డీఎంకేను కోరింది. కానీ అందుకు ఆ పార్టీ ససేమీరా అంది. 18 కంటే ఎక్కువ ఇవ్వలేమని చెప్పింది. పలు దఫాలుగా జరిగిన చర్చల్లో 25 సీట్ల వద్ద పంచాయతీ తెగింది.