పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ గ్రూప్ పై హిండెన్ బెర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ అప్పుడే ఇండియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అదానీ సంస్ధ పెద్ద ఎత్తున ఫ్రాడ్ కు పాల్పడిందని, విదేశాల్లో డొల్ల కంపెనీలు పెట్టి భారీ అవకతవకలకు దిగి పన్నులు ఎగవేసిందని ఈ రిపోర్ట్ ఆరోపించింది. ఈ ఆరోపణలపై సెబి చేత విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. భారత ఆర్ధిక వ్యవస్థలో కీలకమైన రిజర్వ్ బ్యాంక్, సెబి వంటి సంస్థల సెక్యూరిటీ, సుస్థిరతల నేపథ్యంలో వీటిపై సీరియస్ గా ఇన్వెస్టిగేట్ చేయించాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
తన సన్నిహిత బిజినెస్ మన్ (అదానీ) గ్రూప్ పై వచ్చిన ఈ అభియోగాలపై ప్రధాని మోడీ ప్రభుత్వం చూసీ చూడనట్టు వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. బ్లాక్ మనీని అదుపు చేస్తామంటున్న ఈ ప్రభుత్వం తన ఫేవరేట్ బిజినెస్ గ్రూప్ సాగిస్తున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాల పట్ల ఉదాసీనంగా ఉంటోందా ? ఇందులో ‘క్విడ్ ప్రోకో’ (నీకది, నాకిది) వ్యవహారం ఏదైనా ఉందా ? అని ఆయన ప్రశ్నించారు.
తీవ్రమైన ఈ ఆరోపణలపై సెబి పూర్తిస్థాయిలో ఇన్వెస్టిగేట్ చేయాలని కోరుతున్నాం అని ఆయన పేర్కొన్నారు. అదానీ సంస్థకు, మోడీ సర్కార్ కు మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, బాధ్యతాయుతమైన విపక్షంగా మా పార్టీ ఈ డిమాండ్ చేస్తోందని అన్నారు. ఒక కంపెనీ రిపోర్ట్ పై తాముతీవ్రంగా స్పందించవలసిన అవసరం లేనప్పటికీ.. అదానీ గ్రూప్ సాధారణ సంస్థ కానందున మేము స్పందించవలసి వస్తోందని, పైగా ఒకప్పుడు మోడీ ..గుజరాత్ సీఎం అని జైరాం రమేష్ పేర్కొన్నారు.
‘మోడీ ప్రభుత్వం దీనిపై ‘సెన్సార్ షిప్’ విధించడానికి ప్రయత్నించవచ్చు.. కానీ భారతీయ వ్యాపార కార్యకలాపాలు, ఫైనాన్షియల్ మార్కెట్లు ప్రపంచమంతా విస్తరించి ఉన్నాయి.. అలాంటప్పుడు హిండెన్ బెర్గ్ వంటి సంస్థల నివేదికలు తేల్చి చెప్పే కార్పొరేట్ అపసవ్య పోకడలను సింపుల్ గా తోసిపుచ్చలేం.. ఇదేదో దురుద్దేశపూరిత ఆరోపణలుగా కొట్టి పారేయలేం ‘ అని ఆయన అన్నారు.