ప్రధానమంత్రికి సమాధి తవ్వాలని కాంగ్రెస్ పార్టీ కలలు కంటూ బిజీగా ఉందని, కానీ తాను మాత్రం రోడ్ల అభివృద్ధి, పేదల జీవన ప్రమాణాలను పెంపొందించడంలో బిజీగా ఉన్నానని ప్రధాని మోడీ అన్నారు. ప్రజల విశ్వాసమే తనకు కవచమని, కర్ణాటకను సర్వతోముఖాభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఆయనచెప్పారు. ఈ దేశంలోని తల్లులు, సోదరీమణులు, యువకులంతా తనకు రక్షణ కవచంగా ఉన్నారన్నారు. మాండ్యా జిల్లాలో ఆదివారం 118 కిలోమీటర్ల బెంగుళూరు-మైసూరు ఎక్స్ ప్రెస్ వేని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టారు.
2014 కి ముందు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల జీవన ప్రమాణాలను నాశనం చేయడానికి చేయని ప్రయత్నమంటూ లేదని, పేదల ధనాన్ని లూటీ చేసిందని ఆరోపించారు. కర్ణాటకలో ప్రజలు బీజేపీని ఎన్నుకోగానే ఈ రాష్ట్రం అభివృద్ధి పథం వైపు సాగిందన్నారు. ఇక్కడ గత తొమ్మిదేళ్లలో మూడు కోట్ల మందికిపైగా ప్రజలకు ఇళ్ల నిర్మాణం జరిగిందని, జల్ జీవన్ మిషన్ కింద 40 లక్షల కుటుంబాలకు కుళాయిల ద్వారా మంచినీటి సౌకర్యం కల్పించారని ఆయన చెప్పారు.
‘వికాస్’ పేరిట మీ మీ రుణాలను తిరిగి చెల్లించాలన్నదే డబుల్ ఇంజన్ ప్రభుత్వ ధ్యేయమన్నారు.’గత కొన్ని రోజులుగా ఈ ఎక్స్ ప్రెస్ వే గురించి ప్రజలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.. ఈ ప్రాజెక్టు పట్ల యువత ఎంతో ఆసక్తి చూపుతున్నారు’ అని మోడీ పేర్కొన్నారు.
కర్ణాటకలోని మాండ్యా, హుబ్బళ్ళి-ధార్వాడ్ జిల్లాల్లో సుమారు 16 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు, శంకు స్థాపనలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఆరు లేన్ల ప్రాజెక్టు అయిన బెంగుళూరు-మైసూరు సెక్షన్ ఎన్ హెచ్-275 ని ఆయన ప్రారంభించారు. దాదాపు రూ. 8,480 కోట్ల వ్యయంతో చేబట్టిన ఈ ప్రాజెక్టు వల్ల బెంగుళూరు-మైసూరు మధ్య ప్రయాణ కాలం మూడు గంటల నుంచి సుమారు 75 నిముషాలకు తగ్గిపోతుంది. జనతాదళ్-ఎస్ కి గట్టి పట్టున్న ఓల్డ్ మైసూరు రీజన్ లో మాండ్యా జిల్లా కూడా ఒకటి. మైసూరు, చామరాజనగర్, రామనగర, బెంగుళూరు రూరల్, తుమకూరు, హసన్ జిల్లాలు దీని పరిధిలో ఉన్నాయి. 61 అసెంబ్లీ నియోజకవర్గాలతో కూడిన ఈ రీజన్ లో జేడీ-ఎస్ ని మట్టి కరిపించి తాను పాగా వేయాలని బీజేపీ ఉవ్విళ్ళూరుతోంది.