కాంగ్రెస్ పార్టీకి మరో సీనియర్ నేత గుడ్ బై చెప్పారు.సీనియర్ నేత, మాజీ మంత్రి ఏ. చంద్రశేఖర్ ఆ పార్టీ వీడుతున్నట్టు చెప్పారు. ఈ నెల 28న బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. వికారాబాద్ కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే.. తానీ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు.
ఆరు సంవత్సరాలు కాంగ్రెస్‌లో కొనసాగినా తనకు వికారాబాద్‌లో పోటి చేసే అవకాశం రాలేదని చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో తనకు వికారాబాద్ టికెట్ రాకుండా ప్రస్తుత మంత్రి సబితా రెడ్డి అడ్డుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తిగా జీరో అయిందన్న చంద్రశేఖర్.. పార్టీని ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తిగా నాశనం చేశారని విమర్శించారు. తన భార్య ఓడిపోయినా నైతిక భాద్యత వహించలేదని మండిపడ్డారు. ఉత్తమ్‌కు పదవి పిచ్చి ఉందని.. తాను ఈ విషయాన్ని కూడా చాలాసార్లు ఆయనతోనే అన్నానని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్‌లో అన్ని కులాల వారికీ సరైన న్యాయం జరగడం లేదని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున వికారాబాద్‌లో పోటీ చేస్తానని చంద్రశేఖర్ తెలిపారు.