ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహిళా దినోత్సవాన రాజకీయ దురుద్దేశంతోనే ఇదంతా జరుగుతోందని బీఆర్ఎస్ అంటుంటే.. చట్టం తనపని తాను చేసుకుపోతుందని బీజేపీ చెబుతోంది. ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే.. కాంగ్రెస్ పార్టీ వాదన మరోలా ఉంది.
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని అంటోంది కాంగ్రెస్. లిక్కర్ స్కాం కేసులో అనేక అనుమానాలున్నాయని అంటున్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్. రాజకీయ లబ్ధి కోసమే అరెస్టులు జరుగుతున్నాయన్న ఆయన.. బీజేపీ, బీఆర్‌ఎస్ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకు వెళ్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ బలోపేతానికే సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కుటిల రాజకీయాలను ప్రజలు గమనించాలని కోరారు.
తెలంగాణ ఆడబిడ్డగా చెప్పుకునే కవిత డబ్బు కోసం కక్కుర్తి పడి లిక్కర్ కేసులో ఇరుక్కుని తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని మంటగలిపారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కేసులో రామచంద్ర పిళ్లై తాను కవిత బినామీనే అని చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. దీంతోనే బీజేపీ, బీఆర్ఎస్ స్నేహబంధం ఏంటో అర్థం అవుతోందన్నారు.
కవితను అరెస్ట్ చేసే విషయంలో బీజేపీ ఎందుకు వెనకాడుతోందని ప్రశ్నిచారు పొన్నం. గతంలో తమ నాయకురాలు సోనియా గాంధీని దర్యాప్తు సంస్థలు కార్యాలయానికి పిలిపించుకుని ప్రశ్నిస్తే.. కవితను మాత్రం అధికారులే ఇంటికి వెళ్లి విచారించారని గుర్తు చేశారు. ఈ విషయాలన్నింటినీ ప్రజలు గమనించాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ డ్రామాలు తెలుసుకోవాలని సూచించారు.