దేశంలో, రాష్ట్రంలో సంస్కరణలకు పితామహుడిగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ముఖ్యుడంటూ సీఎం కేసీఆర్ హాడావిడి చేశారు. ఓ దశలో కాంగ్రెస్ నేత అయిన పీవీని టీఆర్ఎస్ ఓన్ చేసుకునే వరకు వెళ్లింది. పీవీ కూతురికి ఎమ్మెల్సీ ఇస్తారన్న ప్రచారం కూడా జరిగింది. ఆయన శత జయంతి ఉత్సవాలకు ప్రత్యేక బడ్జెట్, కమిటీ ఏర్పాటు కూడా చేశారు.
కానీ బుధవారం పీవీ వర్ధంతి. కాంగ్రెస్ నేతలు, టీఆర్ఎస్ నేతలంతా నెక్లెస్ రోడ్ లోని పీవీ ఘాట్ ను సందర్శించి ఆయనకు నివాళి అర్పించారు. పీవీ చేసిన పనులను స్మరించుకొని, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం పీవీ ఘాట్ కు రాలేదు. దీంతో కేసీఆర్ ఆయనకు ఇస్తున్న ఘన నివాళి ఇదేనా అని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే కేసీఆర్ పనిచేస్తారన్న అంశం మరోసారి బహిర్గతమైందని… నిజంగానే కేసీఆర్ పీవీ గొప్పవారని భావిస్తే… ఆయన వర్ధంతి రోజున పీవీ ఘాట్ కు రాకుండా ఉంటారా అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
పీవీ కూతురికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తారన్న ప్రచారం టీఆర్ఎస్ కావాలనే చేసింది కానీ ఇవ్వలేదని, ఇప్పుడు ఆయన వర్ధంతి రోజున కేసీఆర్ రాలేదని… ఏ ఎండకు ఆ గొడుగుపట్టే రకం కేసీఆర్ అని మరోసారి స్పష్టమయిందంటున్నారు కాంగ్రెస్ నాయకులు.