కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొట్లాడే ఉద్యోగాలు తెచ్చుకుందామని టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి, బెల్లయ్య నాయక్ నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. నోటిఫికేషన్ విడుదల చేయలేదని మహబూబాబాద్ జిల్లాలో ముత్యాల సాగర్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఆయన అన్నారు.
దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని.. బాధిత కుటుంబానికి కోటి రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన కోరారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొట్లాడి ఉద్యోగాలు కూడా తెచ్చుకుందామని అన్నారు.
రాష్ట్రంలో లక్షా 92 వేల ఉద్యోగాలు ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. నిరుద్యోగ యువత టీఆర్ఎస్ ప్రభుత్వంపై బలంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
ఇంతకాలం జోన్ల పేరుతో నోటిఫికేషన్లు విడుదల చేయలేదని.. ఇప్పుడు ఎందుకు చేయటం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని హామీ ఇచ్చారు.