వరుస ఓటములతో ఢీలా పడ్డ కాంగ్రెస్ పార్టీ… గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో ఉండనుంది. నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానంలో తనకు మద్ధతివ్వాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం కోరినప్పటికీ కాంగ్రెస్ పోటీ చేయనుంది. ఇక ఈ స్థానానికి మాజీ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ నుండి ఎమ్మెల్సీ పదవి వదులుకొని కాంగ్రెస్ లో చేరిన రాములు నాయక్ తో పాటు ఓయూ విద్యార్థి నేత మానవతా రాయ్ చివరి వరకు పోటీలో ఉన్నా రాములు నాయక్ వైపు పార్టీ మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఆయన సామాజిక వర్గానికి చెందిన గ్రాడ్యుయేట్స్ ఎక్కువగా ఉండటం, గత ఎన్నికల్లో ఆయనకు పోటీ అవకాశం ఇవ్వని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఇక మహబూబ్ నగర్- హైదరాబాద్-రంగారెడ్డి స్థానానికి యువనేత వంశీచంద్ రెడ్డితో పాటు మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ పోటీచేసేందుకు ఆసక్తి కనపర్చారు. కానీ ఈ సీటును చిన్నారెడ్డికి ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు గాంధీబవన్ వర్గాలంటున్నాయి.