కాంగ్రెస్… రాష్ట్రం ఏదైనా, జాతీయ నాయకులైనా… గ్రూపు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్. ఇక ఎన్నికలొచ్చాయా… ఈ గ్రూపు రాజకీయాలను సెటిల్ చేస్తూ అభ్యర్థులను సెలక్ట్ చేయాలి. ఏమాత్రం తేడా వచ్చిన బహిరంగంగానే విమర్శలు వస్తాయి. అవి ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపేలా ఉంటాయి.
కానీ తెలంగాణలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పరిణతి ప్రదర్శించింది. రోజురోజుకు పార్టీ పరిస్థితి దిగజారుతున్న సందర్భంలో… అక్కడి నుండి సీనియర్ నేత జానారెడ్డి బరిలో ఉంటారా…? కొడుకు రఘువీర్ ను బరిలోకి దింపుతారా…? అన్న చర్చ ఊపందుకుంది. జానా సైతం ఉప ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆలోచనతో ఉన్నట్లు సన్నిహితుల వద్ద కామెంట్ చేయటంతో కాంగ్రెస్ వర్గాలు ఉలిక్కిపడ్డాయి.
ఓవైపు టీఆర్ఎస్, మరోవైపు బీజేపీలు దూకుడు మీదున్న నేపథ్యంలో… నోటిఫికేషన్ వచ్చిన రోజే అభ్యర్థిని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఉప ఎన్నికల్లో జానారెడ్డి పేరును ఖరారు చేస్తూ ఏఐసీసీ ప్రకటించింది. టీఆర్ఎస్, బీజేపీలు ఇంకా అభ్యర్థుల వేట కొనసాగిస్తున్న తరుణంలో కాంగ్రెస్ ఇక ప్రచార జోరు పెంచనుంది.