తెలంగాణ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్ చేపట్టిన అభిప్రాయ సేకరణ ప్రక్రియ సీరియస్‌గా సాగుతోంది. అర్ధరాత్రి వరకు గాంధీభవన్‌లోనే ఉండి పీసీసీ కోర్‌కమిటీ నేతల ఒపీనియన్‌ను ఠాగూర్ తెలుసుకున్నారు. అయితే ఇలాంటి కీలకమైన సమయంలోనూ చాలా మంది నేతలు పార్టీ భవిష్యత్తు కంటే.. తమకు జరిగే ప్రయోజనమేంటో మాత్రమే చూసుకున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఠాగూర్‌తో భేటీలో కొందరు నేతలు నేరుగా తమకే పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగించాలని కోరారు. అయితే చాలామంది లీడర్లు మాత్రం తమ సామాజిక వర్గానికి చెందినవారిలో ఎవరికి ఇచ్చినా ఒకే అంటూ చెప్పినట్టుగా తెలిసింది. రాష్ట్రంలో బీసీలు ఎక్కువగా ఉన్న కారణంగా.. పీసీసీ పీఠం వారికి ఇస్తే పార్టీకి ప్రయోజనం ఉంటుందని బీసీ నేతలు విజ్ఞప్తి చేస్తే.., మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి, విధేయులకే ఇవ్వాలంటూ వీహెచ్ వంటి నేతలు సూచించినట్టు సమాచారం. మరోవైపు ఈ సారి రాష్ట్రంలో పార్టీ నాయకత్వ అవకాశాన్ని బలహీనవర్గాలకు ఇస్తే బాగుంటుందని ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన నేతలు అభ్యర్థించినట్టుగా తెలిసింది. రెడ్డి వర్గానికి చెందిన నేతలు కూడా దాదాపుగా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారట. ఇలా ఎవరికి వారు తమ సామాజిక వర్గానికి చెందిన వారు అనో, లేక తమకు దగ్గరి వారు అనే కారణలతో పేర్లు సూచించడమే తప్ప.. ఫలానా పని చేసే వ్యక్తికి, ప్రజాకర్షక వ్యక్తికి పీసీసీ నాయకత్వాన్ని ఇవ్వాలని అతి కొద్ది మాత్రమే కచ్చితమైన పేరు చెప్పినట్టుగా తెలిసింది.
వాస్తవానికి కాంగ్రెస్‌లో మొదటి నుంచి పంచాయతీనే ఇది. సమర్థుడైన నాయకుడిని ఎంపిక చేసుకొని పార్టీని బతికించుకోవాల్సింది పోయి.. తమకేంటి అన్న పాయింట్‌లోనే ఆలోచించి ఎవరికివారు తమ వంతు నష్టం చేస్తుంటారని విశ్లేషకులు అంటున్నారు.