దేశంలో గాంధీ కుటుంబాన్ని రాజకీయంగా హత్య చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. కొన్ని దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన ఘనత కాంగ్రెస్ దని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఈడీ విచారణ దృష్ట్యా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ కేసులను నిరసిస్తూ టీ-కాంగ్రెస్ హైదరాబాద్ ఈడీ ఆఫీసు ముందు నిరసన దీక్ష చేపట్టింది.
గాంధీ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని జగ్గారెడ్డి గుర్తు చేశారు. మరి బీజేపీలో దేశం కోసం ఒక్కరైనా త్యాగం చేసినవారు ఉన్నారా? అని ప్రశ్నించారు. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్ గాంధీలను బీజేపీ ఇబ్బందులకు గురి చేస్తోందంటూ ఆరోపించారు.
స్వాతంత్ర్య ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ బ్రిటీష్ కి వత్తాసు పలికిందని,.. గాంధీని చంపిన గాడ్సేని బీజేపీ నేత ఒకరు పార్లమెంట్ లో గొప్పవాడు అంటున్నారని విమర్శించారు. బ్యాంకులు లూటీ చేసిన నేతలంతా బీజేపీలోనే ఉన్నారంటూ ఆరోపించారు. వారి మీద ఈడీ చర్యలు ఉండవా? అని ప్రశ్నించారు.
గాంధీ కుటుంబానికి తామంతా అండగా ఉంటామని స్పష్టం చేశారు జగ్గారెడ్డి. బీజేపీ కుట్రలను తిప్పికొడతామని తెలిపారు.