కొండా దంపతులు… ఒకప్పుడు వరంగల్ రాజకీయాల్లో వెలుగు వెలిగిన నాయకులు. కానీ 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత వారు సైలెంట్ గా ఉన్నారు. టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన కొండా కపుల్స్… ఓటమి పాలవ్వటంతో టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంచి పట్టు, క్యాడర్ ఉన్న కొండా సురేఖ, కొండా మురళిలను పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ చాలా కాలంగా ప్రయత్నిస్తుంది.
ఇటు కాంగ్రెస్ పార్టీకి కొండా కపుల్స్ ఇప్పుడు ఎంతో అవసరం. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా బలమైన నేత కావటంతో వారిని కాపాడుకునేందుకు కొత్త ఇంచార్జి మాణికం ఠాగూర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో రాబోయే వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల బాధ్యతను కొండా దంపతులకు అప్పజెప్పాలని ఆదేశించారు. పార్టీ అభ్యర్థుల ఎంపిక, గెలుపోటముల బాధ్యతను వారికే ఇవ్వాలని చెప్పినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో దూకుడు మీదున్న బీజేపీ… కాంగ్రెస్ లో కీలక నేతలపై ఫోకస్ చేసింది. ఒకరి తర్వాత ఒకరిపై సంప్రదింపులు చేస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మంచి ఫలితాలు రావటంతో ఖమ్మం, వరంగల్ కార్పోరేషన్లపై ఫోకస్ చేయనుంది. దీంతో కాంగ్రెస్ ముందుగానే తమ నేతలను కాపాడుకునేందుకు ఈ ఎత్తుగడ వేసినట్లుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.