అనర్హత వేటు పడిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మద్దతుగా ఆ పార్టీ ఢిల్లీలోని రాజ్ ఘాట్లో ‘సంకల్ప్ సత్యాగ్రహ’ను ప్రారంభించింది. రాజ్ ఘాట్ ఏరియాలో 144 సెక్లన్ అమలులో వున్నప్పటికీ కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ చేపట్టడం గమనార్హం.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు ఇతర సీనియర్ నాయకులు కేసీ వేణుగోపాల్, పీ. చిదంబరం, జైరాం రమేష్, ఇతర నేతలు నిరసనలో పాల్గొన్నారు, పోలీసుల ఆంక్షలను లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు వేదిక వెలుపల గుమిగూడారు.
ఈ సందర్బంగా ప్రియాంక గాంధీ మాట్లాడుతూ… ఈ దేశ ప్రధాని పిరికి పంద అని ఆమె అన్నారు. అవసరమైతే తనపై కూడా కేసు పెట్టాలని, జైల్లో వేయాలని ఆమె అన్నారు. ఆయన ఓ గర్వంతో కూడిన పిరికి పంద అన్నారు. గర్వించే రాజును ఓడించే సంప్రదాయం మన దేశానికి ఉందన్నారు.
కాంగ్రెస్ “వంశపారంపర్య రాజకీయాలు” చేస్తోందంటూ ఆరోపించే బీజేపీ వ్యూహాన్ని కూడా ప్రియాంక తప్పుబట్టారు. రాముడు కూడా రాజవంశం నుండి వచ్చినందున అధికార పార్టీ కూడా ఆయన గురించి అదే మాట చెబుతుందా అని ఆమె ప్రశ్నించారు.