– రాష్ట్ర‘పత్ని’ వ్యాఖ్యలపై దుమారం
– తెలంగాణలో బీజేపీ నిరసన బాట
– గాంధీభవన్ ముట్టడి.. జిల్లాల్లో దిష్టిబొమ్మల దగ్ధం
– అధీర్ రంజన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్
Advertisements
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్ర‘పత్ని’గా అభివర్ణిస్తూ కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ నేతలు భగ్గుమన్నారు. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణవ్యాప్తంగా సోనియాగాంధీ దిష్టిబొమ్మలను దగ్దం చేశారు. పేదలు, దళిత, గిరిజనులంటే కాంగ్రెస్ కు మొదటి నుండి చులకన భావన అని, అట్టడుగువర్గాల ఆదివాసీ మహిళ రాష్ట్రపతి కావడాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్రపతిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు యావత్ దేశ ప్రజలను అవమానించినట్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ లోని గాంధీభవన్ ను బీజేపీ ఎస్టీ మోర్చా ముట్టడించింది. పోలీసులు నేతలను అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ నేతలు బారికేడ్లను సైతం తోసుకుని గాంధీభవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ.. భారీగా మోహరించిన ఖాకీలు అడ్డుకున్నారు. ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ మైదానం సమీపంలో సోనియాగాంధీ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అధీర్ రంజన్ చౌదరిని కాంగ్రెస్ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మెదక్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోనియాగాంధీ దిష్టిబొమ్మలను దగ్దం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు అనుమతి లేదంటూ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ తోపాటు ఇతర నేతలను అదుపులోకి తీసుకున్నారు. వనపర్తి జిల్లా అధ్యక్షులు రాజవర్దన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నేతలు సోనియా దిష్టిబొమ్మను దగ్దం చేశారు. కాంగ్రెస్ డౌన్ డౌన్… రాష్ట్రపతిని కించపర్చిన నేతను బహిష్కరించాలంటూ నినాదాలు చేశారు.
హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో పట్టణంలో సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. గిరిజన మహిళల పట్ల కాంగ్రెస్ వైఖరి ఏమిటనేది అధీర్ వ్యాఖ్యలతో తేటతెల్లమైందని మండిపడ్డారు. ఆయనపై చట్ట పరమైన చైర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శ్యాంసుందర్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా నేతలు సోనియాగాంధీ దిష్టిబొమ్మలను దగ్దం చేశారు. కాంగ్రెస్ తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పేవరకు ఆందోళన కొనసాగిస్తామని పేర్కొంటూ వికారాబాద్ జిల్లా గిరిజన మోర్చా కన్వీనర్ శ్రీలతా పవార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి.
రాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అధీర్ చౌదిరిని వెంటనే కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ… నారాయణపేట, సంగారెడ్డి, రంగారెడ్డి అర్బన్ జిల్లా, హైదరాబాద్ జిల్లాల నేతలు భారీ ఎత్తున దిష్టిబొమ్మలను దగ్దం చేయడంతోపాటు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ధర్నాలు చేపట్టారు.