మోడీ సర్కార్ పై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. భారత్ జోడో యాత్ర చేసినప్పటి నుంచి ప్రధానిలో ఆందోళన మొదలైందని పేర్కొంది. అందుకే రాహుల్ గాంధీని ఇబ్బంది పెట్టాలని కేంద్రం చూస్తోందని ఆరోపణలు గుప్పించింది. అందులో భాగంగానే రాహుల్ గాంధీ ఫైట్ కు అనుమతి ఇవ్వలేదని తెలిపింది.
రాహుల్ గాంధీ వారణాసి పర్యటనను కేంద్రం అడ్డుకుందని ఆ పార్టీ నేత అజయ్ రాయ్ అన్నారు. వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి ఎయిర్ పోర్టులో ఆయన ఫ్లైట్ ల్యాండ్ కాకుండా కేంద్రం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుందన్నారు. కేంద్ర పెద్దల నుంచి ఒత్తిడి నేపథ్యంలోనే ఫ్లైట్ ల్యాండింగ్ కు అధికారులు అనుమతులు ఇవ్వలేదన్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వారణాసిలో మంగళవారం పర్యటించాల్సి వుంది. ఈ మేరకు ఆయన సోమవారం వారణాసికి చేరుకోవాల్సి వుంది. మంగళవారం ఉదయం శ్రీ కాశీ విశ్వేశ్వరున్ని దర్శించుకోవాల్సి ఉంది. కానీ రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఫ్లైట్ కు అధికారులు అనుమతి ఇవ్వలేదు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో ఎయిర్ పోర్టులో ట్రాఫిక్ రద్దీ ఎక్కువవుందనే కారణంతో ఎయిర్ పోర్టు రాహుల్ ఫ్లైట్ ల్యాండింగ్ కు అనుమతించలేదు. మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న సాయంత్రం కాశీ విశ్వనాధున్ని దర్శించుకున్నారు.