అంచనాల బడ్జెట్ కు వాస్తవ బడ్జెట్ కు పొంతన ఉండటం లేదన్నారు ఏఐసీసీ పొగ్రామ్స్ కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. శనివారం గాంధీ భవన్ లో హాథ్ సే హాథ్ జోడోయాత్రపై మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున నాల్గొవ చార్జిషీట్ విడుదల చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు చేసిన సందర్భంగా మిగులు బడ్జెట్ గా కాంగ్రెస్.. రాష్ట్రాన్ని అప్పగిస్తే, ఎనిమిదేళ్లలో అప్పుల కుప్పగా చేసి పెట్టారన్నారు. ఇప్పటికే రూ.5 లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. ఈ ఎనిమిదేళ్ళ పాలనలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా.. ఎనిమిది రెట్ల అప్పు చేశారని విమర్శించారు.
మంత్రి హరీష్ రావు మామకు భజన చేయడం తప్ప బడ్జెట్ వాస్తవ రూపం లేదన్నారు. రైతు రుణమాఫీ విషయంలో కూడా కేసీఆర్ మోసం చేశారు. లక్ష రూపాయల రుణమాఫీ కావాలంటే రూ.18 వేల కోట్లు అవసరమైతే.. బడ్జెట్ లో కేవలం రూ.6 వేల కోట్లే కేటాయించారన్నారు. విద్య, వైద్యానికి బడ్జెట్ లో సరైన కేటాయింపులు జరగ లేదన్నారు.
18 లక్షల మంది డబుల్ ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకుంటే.. 3 లక్షల ఇళ్లను మాత్రమే తూతూమంత్రంగా కేటాయించారని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందనడానికి ఈ బడ్జెట్ ప్రత్యక్ష సాక్ష్యమన్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి.