తెలంగాణలో 2014 నుండి 2020 వరకు జరిగిన రైతు ఆత్మహత్యలపై ఎన్‌హెచ్‌ఆర్సీకి కాంగ్రెస్ సీనియర్ నేత బక్క జడ్సన్ ఫిర్యాదు చేశారు. దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆయన మెమోరాండం ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…
తెలంగాణలో 6121 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు పోలీసులు సమాధానం ఇచ్చినట్టు వార్తలు వచ్చాయన్నారు. అదే సమయంలో నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం 2014 నుండి 2020 వరకు తెలంగాణలో 5956 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆయన అన్నారు.
దేశంలోనే అత్యంత రైతు మిత్ర ప్రభుత్వం తమదేనని బీఆర్ఎస్ సర్కార్ చెప్పుకుంటోందన్నారు. కానీ గత 8 ఏండ్లలో రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేసిన కృషి చాలా తక్కువన్నారు. రైతుల రుణాలను మాఫీ చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటున్నప్పటికీ అది సత్యదూరమన్నారు.
రైతు బంధు పథకం వల్ల బడా భూస్వాములకు మాత్రమే కోట్లాది రూపాయల లబ్ధి చేకూరుతోందన్నారు. కౌలు రైతులు, నిజమైన రైతులకు రైతుబంధు పథకం వల్ల ఎలాంటి ప్రయోజనం అందలేదన్నారు. గత రుణాలు క్లియర్ కాలేదని బ్యాంకులు రైతులకు తాజా రుణాలు ఇవ్వడం లేదన్నారు.
కౌలు రైతులకు కూడా రైతు బంధు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు బంధు పథకాన్ని 5 ఎకరాలు లేదా అంతకంటే తక్కువ ఉన్న రైతులకు పరిమితం చేయాలని కోరారు. రైతులందరి బ్యాంకు రుణాలను తక్షణమే మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.