ఇన్నేళ్ల స్వతంత్ర భారతంలో రాజ్యాంగంపై ఇంత ప్రమాదకరమైన వ్యాఖ్యలు చేసినవారు ఎవరూ లేరన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కొత్త రాజ్యాంగం రావాలి అని ముఖ్యమంత్రి చెప్పడం తెలంగాణ ప్రజలుగా అందరం సిగ్గుపడాలని చెప్పారు. అందరికీ సమాన హక్కులు కల్పించిన గ్రంథం భారత రాజ్యాంగమని అది లేకపోతే రాజులు, రాజ్యాలు మాత్రమే ఉండేవని తెలిపారు.
ఇది దళితులు, గిరిజనులు, రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కాదన్న భట్టి.. కేసీఆర్ ఆలోచనా విధానం ఏంటో అర్థమైందన్నారు. కేసీఆర్ పాలన చేయడానికి అనర్హుడని… భారత రాజ్యాంగం పనికి రాదని చెప్పిన ముఖ్యమంత్రిని తొలగిస్తే తప్ప రాజ్యాంగానికి గౌరవం ఉండదని చెప్పారు.
రాజ్యాంగంపై మాట్లాడిన ముఖ్యమంత్రిని బూతులు కాదు ఏం చేసినా తప్పులేదని. భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పక్షాన మండల, జిల్లా స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ తీసుకుందామన్నారు.
అందరికీ భారత రాజ్యాంగం అందించేలా చేద్దామని చెప్పారు భట్టి. ప్రతీ సమస్యకు పరిష్కారం రాజ్యాంగం చదవడమేనని రాష్ట్ర కాంగ్రెస్ పక్షాన అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేద్దామని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే టీఆర్ఎస్ ఆ పార్టీని వదిలి నాయకులు బయటకు రావాలన్నారు భట్టి.