కాంగ్రెస్ సృష్టించిన సంపదతోనే హైదరాబాద్ లో భూముల రేట్లు పెరిగాయని.. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని అమ్మేస్తోందని అన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. గాంధీభవన్ లో కాంగ్రెస్ రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రే అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భట్టి మాట్లాడారు. కాళేశ్వరం కట్టి లక్ష కోట్లు తిన్నారు కానీ.. చుక్క నీరు పారించలేదని ఆరోపించారు.
కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల వల్లే తెలంగాణలో 24 గంటల విద్యుత్ సాధ్యమవుతోందని వివరించారు భట్టి. కాంగ్రెస్ హయాంలో తవ్విన కాలువల్లోనే బీఆర్ఎస్ సర్కార్ నీళ్లిస్తోందని విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రమాదకరంగా మారిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రభుత్వం కృష్ణానదిపై పాలమూరు తప్ప ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టలేదన్నారు.
బీఆర్ఎస్, బీజేపీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారాయన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని ప్రజలను కోరారు భట్టి. ప్రజల సొమ్మును కొద్దిమంది పెద్దలకే బీజేపీ పంచి పెట్టిన విషయాన్ని రాహుల్ గాంధీ జోడో యాత్రలో ప్రజలకు చాటి చెప్పారన్నారు. దేశాన్ని బీజేపీ మత ప్రాతిపదికన విడదీస్తోందని విమర్శించారు. అదానీకి ప్రధాని మోడీ పంచిన సొమ్ముపై హిండెన్ బర్గ్ రిపోర్ట్ ఇచ్చిందని తెలిపారు.
మండల, బ్లాక్ స్థాయిలో కాంగ్రెస్ నేతలు హాథ్ సే హాథ్ జోడో యాత్ర చేపట్టాలన్నారు భట్టి. ప్రతిరోజూ ఇంటింటికి వెళ్లాల్సిందేనని నేతలకు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.