దాసోజు శ్రవణ్.. కాంగ్రెస్ నేత
ఖరీఫ్ సీజన్‌లో ఉత్పత్తులను సేకరించేందుకు ప్రభుత్వం వద్ద సరైన ప్రణాళికలు, తదుపరి పంట సీజన్ ల కోసం ప్రణాళికలు కానీ లేవు. ప్రభుత్వం సన్నద్ధతలో లేనందున.. సరిపడా గన్నీ సంచులు మరియు టార్పాలిన్ కవర్లు అందించకపోవడం వంటి అసౌకర్యాలు ఎదురవుతున్నాయి. అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోయారు. యాసంగి సీజన్ లో 92 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి కాగా.. మే 25 నాటికి 31 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు.
రైతుల నుంచి సేకరించిన వరిలో పొట్టు 6 నుండి 10 కిలోలకు మించి ఉంటుందని మిల్లర్లు చెప్పడంతో రైతులు మోసపోతున్నారు. అయితే.. క్వింటాల్ కు 2 నుండి 3 కిలోల తగ్గింపు అనుమతించదగిన స్థాయి. ఈ రబీ సీజన్ లో తెలంగాణలో 1.04 లక్షల ఎకరాల్లో కంది సాగు చేయగా.. 18 లక్షల క్వింటాళ్లు కంది పంట పండించారు. అయితే దిగుబడిని కొనుగోలు చేసేందుకు ఇప్పటి వరకు ఏ కొనుగోలు కేంద్రం తెరవలేదు. వర్షానికి దిగుబడి తడిసిపోయి.. తెగుళ్లు సోకే అవకాశం ఉందని రైతులు భయపడుతున్నారు.
ఎంఎస్పీ జాబితాలోని అన్ని పంటలను ప్రభుత్వం సేకరించడం లేదు. జాబితాలో లేని పంటల కోసం ప్రభుత్వం మార్కెట్ స్థిరీకరణ నిధి నుండి నిధులను ఉపయోగించాలి. కానీ అది చేయడం లేదు. జూన్ 10 నాటికి వరి ధాన్యం కొనుగోళ్లు నిలిపివేస్తామని ప్రకటించారు. మరోవైపు.. 2018లో లక్ష రూపాయల వరకు రుణాలను ఒకేసారి మాఫీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. 36.68 లక్షల మంది రైతుల రుణమాఫీకి రెండు విడతల్లో కేవలం 5.66 లక్షల మంది రైతులు మాత్రమే లబ్ధి పొందారు. మిగిలిన 31.02 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలు చెల్లించకపోవడంతో పెండింగ్ లో ఉంచారు.
రైతులు ప్రయివేటు వడ్డీ వ్యాపారుల వద్ద పంట పెట్టుబడి కోసం అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తోంది. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి తన జాతీయ స్థాయిని పెంచుకోవడానికి దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, పెరుగుతున్న అప్పుల కారణంగా 2014 నుండి సుమారు 8400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.