తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సర్కార్ కు ధీటుగా టీ కాంగ్రెస్ కూడా తెలంగాణ దశాబ్ది వేడుకలను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రతీ నెలా మొదటి వారంలో పీఏసీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై 20 రోజులు కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. తొమ్మిదేళ్లలో కేసీఆర్ వైఫల్యాలపై.. ఫెయిల్యూర్ కేసీఆర్.. స్లోగన్ తో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మధు యాష్కీ వెల్లడించారు. ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి పాలాభిషేకం చేసి.. కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని చెప్పారు. 20 రోజులు కాంగ్రెస్ కార్యకర్తలు ఇళ్లపై జెండాలు ఎగరేయాలని పిలుపునిచ్చారు మధు యాష్కీ.
అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఎల్లుండి మోడీ పార్లమెంట్ భవనం ప్రారంభిస్తున్నారని, ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎలా ఉండాలని చెప్పేది ఆర్టికల్ 79, 84 అని, పార్లమెంట్ అనేది రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్ సభ, ఫౌండింగ్ మెంబర్స్ అని తెలిపారు. రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం సరికాదన్నారు ఉత్తమ్.
కనీసం శంకుస్థాపనకు కూడా పిలవలేదని మండిపడ్డారు. రాష్ట్రపతికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. మోడీ ఇప్పటివరకు ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదని, పార్లమెంట్ అతి తక్కువ రోజులు పని చేసింది మోడీ హయాంలోనేనని విమర్శలు గుప్పించారు. కొత్త బిల్లులపై అసలు చర్చ అనేదే ఉండదన్నారు. పార్లమెంట్ అందరిదని, మోడీ ఒక్కరిదే కాదని మండిపడ్డారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.