ఫెల్యూర్ మినిస్టర్ అనుకున్నాం.. కానీ ఫేక్ మినిస్టర్ అని తేలిపోయిందని తెలంగాణ మంత్రి హరీష్ రావుపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ విడుదల చేసిన చార్జిషీట్ పై మంత్రి హరీష్ కామెంట్స్ శోచనీయమన్నారు. అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా.. అనవసర విషయాలు మాట్లాడారని మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఏం చేస్తుంది? అనేది అక్కడి ప్రజలు అడుగుతారు. ఇక్కడ ప్రజలు మీకు ఓటేశారు.. ఇక్కడి ప్రజలకు ముందు సమాధానం చెప్పాలన్నారు.
పీహెచ్ సీలో చర్చకు వస్తావా? లేక జిల్లా ఆస్పత్రిలో చర్చకు వస్తావా? అని సవాల్ విసిరారు. రూ.1200 కోట్లతో సెక్రటేరియట్ కడతారు.. పార్టీ ఆఫీసులూ కడతారు కానీ పేదల కోసం ఒక్క ఆస్పత్రి కూడా కట్టలేదంటూ విమర్శించారు. ఆస్పత్రికి రావాలంటే మహిళలు రావాలంటే జంకుతున్నారు. నిర్మల్ లో పనికి మాలిన మంత్రి ఉన్నాడు. ఏరియా ఆస్పత్రిలో 22 మంది వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
కాన్పుల వార్డులో సగం మంది వైద్యులే ఉన్నారు. ఆరోగ్య శ్రీ కింద వైద్యం చేసిన ఆస్పత్రులకు తెలంగాణ ప్రభుత్వం రూ.800 కోట్లు బాకీ పడింది. వైద్య రంగంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. వైద్య ఆరోగ్య శాఖపై చర్చకు సిద్ధమా? కాదని మాట్లాడినట్టు నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటూ అంటూ ఆయన సవాల్ విసిరారు. 76 శాతం మంది ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు.
అలాగే 80 శాతం మంది ప్రైవేట్ మెడికల్ షాపులకు వెళ్తున్నారు. 1100 మంది వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీఎం కేసీఆర్.. ఆరోగ్య శాఖ మంత్రిని మార్చి సమర్థవంతమైన వ్యక్తిని మంత్రిని చేయండి. కేసీఆర్ కి రాజ్యాంగం మీద గౌరవం లేదు. గవర్నర్ మీద కేసు వేయడం ఎందుకు? విత్ డ్రా చేసుకోవడం ఎందుకు? అంటూ పేర్కొన్నారు మహేశ్వర్ రెడ్డి.