ఎన్.ఆర్.సి కి ఎన్.పి.ఆర్ ఏ విధంగా ఆధారమనే విషయం అర్ధం కావడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు పౌరసత్వ సవరణ నియమాలు-2003 గురించి వివరించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి మనీష్ తివారీ అన్నారు. పౌరసత్వానికి మతం ఆధారం కాకూడదనే విషయం కూడా ఆయనకు అర్ధం చేయించాలని తివారీ చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఒకసారి ఎన్.పి.ఆర్ చేస్తే ఎన్.ఆర్.సి ఇక ఆగదని చెప్పారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రధాన మంత్రిని కలిసిన తర్వాత సీఏఏ, ఎన్.పి.ఆర్ గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని…వాటి వల్ల దేశ పౌరులకు ఏ రకంగాను నష్టం కలగదన్నారు. సీఏఏ, ఎన్.పి.ఆర్ పేరిట ప్రజలను రెచ్చగొట్టే వాళ్లు చట్టాలను పూర్తిగా అర్ధం చేసుకోవాలని కోరారు.
ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలు మహారాష్ట్రలోని శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీల సంకీర్ణ ప్రభుత్వం మహా వికాస్ అగాడీలో విభేదాలకు కారణమైందనే వార్తలు రావడంతో ఉద్ధవ్ ఠాక్రే వాటిని కొట్టి పారేశారు. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ ప్రకారం మా సంకీర్ణ ప్రభుత్వం ఐదేళ్ల పూర్తి కాలం ఉంటుందని ఠాక్రే స్పష్టం చేశారు.