ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణంపై ఫిర్యాదు చేసింది తామేనన్నారు. తమ పార్టీ చేసిన పోరాటాల వల్లే ఈ రోజు ఈ స్కామ్ లో కదలిక వచ్చిందని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ కవితపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
మహిళ సాధికారత గురించి ఎమ్మెల్సీ కవితకు ఈ రోజు గుర్తొచ్చిందా అని ఆయన ఫైర్ అయ్యారు. కవిత ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంట్‌లో మహిళల హక్కుల కోసం ఎన్నిసార్లు మాట్లాడిందని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ ఒత్తిడి తీసుకు రావడం వల్లే కవిత ఇంటికి వచ్చి సీబీఐ విచారణ జరిపిందన్నారు.
శంషాబాద్‌లో దిగగానే బీఆర్ఎస్ పోస్టర్లు కనిపిస్తున్నాయని చెప్పారు. బీఆర్ఎస్‌లో మరో మహిళ లేనట్టు కవిత ఒక్కరి ఫోటోనే కనిపిస్తోందన్నారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మారే క్రమంలో దానికి కావాల్సిన డబ్బంతా ఎక్కడి నుంచి వస్తోందని అని ఆయన ప్రశ్నించారు.
సామాన్యుల నుంచి భారీగా డబ్బు కొల్లగొట్టి దాన్ని బీఆర్ఎస్ పార్టీ కోసం వాడుకుంటోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో తప్పితే వేరే ఇతర రాష్ట్రాల్లో ఒక్క సర్పంచ్‌ని కూడా గెలిపించుకునే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కుటుంబానికి వీఆర్ఎస్ ప్రకటించాలని ఆయన ప్రజలను కోరారు.