కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక సందర్భంగా హైదరాబాద్ గాంధీభవన్ లో కాసేపు టెన్షన్ నెలకొంది. జనగామ నియోజకవర్గం డెలిగేట్ ఓట్ల విషయంలో గందరగోళం నెలకొంది. ప్రతీ నియోజకవర్గం నుంచి ఇద్దరికి ఓటు వేసే అవకాశం కల్పించగా.. జనగామ నుంచి పొన్నాల లక్ష్మయ్య, చెంచారపు శ్రీనివాస్ రెడ్డి ఓటు వేసేందుకు వెళ్లారు. అయితే.. శ్రీనివాస్ రెడ్డి పేరు అందులో లేకపోవడంతో ఆయన్ను అడ్డుకున్నారు.
శ్రీనివాస్ రెడ్డిని ఓటు వేయకుండా అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పొన్నాల. 45 ఏండ్ల కాంగ్రెస్ మనిషికి అవమానం జరిగిందని మండిపడ్డారు. ఓటరు లిస్ట్ నుంచి శ్రీనివాస్ రెడ్డి పేరును చివరి క్షణంలో ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. అయితే, పీఆర్వోతో వాగ్వాదానికి దిగిన పొన్నాలను సీనియర్ నేత జానారెడ్డి సముదాయించి అక్కడినుంచి తీసుకెళ్లారు.
శ్రీనివాస్ రెడ్డి స్థానంలో కొమ్మురు ప్రతాప్ రెడ్డి పేరును చేర్చారు. ఆదివారం రాత్రి ఇదంతా జరిగినట్లు చెప్పుకుంటున్నారు. చివరి నిమిషంలో కొమ్మూరి పేరు చేర్చడం ఏంటని నిలదీస్తున్నారు పొన్నాల. పోలింగ్ ఏజెంట్లపై మండిపడ్డ ఆయన.. శ్రీనివాస్ రెడ్డికి ఓటు వేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.