కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా మంగళవారం తన పెళ్లి రోజు సందర్బంగా సోషల్ మీడియాలో భావోద్వేగంతో కూడిన పోస్టులు పెట్టారు. బిజినెస్ మేన్ రాబర్ట్ వాద్రాను పెళ్లి చేసుకున్న రోజు కావడంతో జీవితంలోని వివిధ సందర్బాల్లో దిగిన ఫోటోలను షేర్ చేశారు. ”జీవితంలోని లక్షలాది అందమైన జ్ఞాపకాలు…ప్రేమ…కన్నీళ్లు… నవ్వులు… ఆవేశం… స్నేహం… కుటుంబం…భగవంతుడు ఇచ్చిన రెండు బహుమతులు, 4 వేర్వేరు అభిమాన కుక్కలు, నా నుంచి విడదీయరాని జ్ఞాన సంపదల కలబోత జీవితం…6+23…..29 సంవత్సరాలు ఈరోజుకు…ఎప్పటికీ ” అని ట్వీట్ చేశారు. ఆమె పెళ్లి రోజు ఫోటోలు, తల్లి సోనియాగాంధీ, సోదరుడు రాహుల్ గాంధీ, భర్త వాద్రా, పిల్లలు రైహాన్, మిరాయ లతో దిగిన ఫోటోలను షేర్ చేశారు.
గత ఏడాది జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రియాంక గాంధీ పార్టీ జనరల్ సెక్రెటరీ బాధ్యతలు స్వీకరించారు. తన భర్త రాబర్ట్ వాద్రాపై హర్యానా, రాజస్థాన్ లో వచ్చిన భూ వివాదాలు, అవినీతి ఆరోపణలను గట్టిగా తప్పికొట్టారు.
48 సంవత్సరాల ప్రియాంక గాంధీని వాళ్ల నాయనమ్మ, దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీతో పోల్చుతుంటారు. అయితే గత ఏడాది రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కాపాడలేపోయారు. చాలా కాలంగా అమేధీ నుంచి గాంధీ కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఆమె సోదరుడు రాహుల్ గాంధీని కూడా గెలిపించలేకపోయారు.