కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన ట్విట్టర్ బయోడెటాలో మార్పులు చేశారు. అంతకు ముందు ఆయన బయోడెటాలో ఎంపీ అని ఉండగా దాన్ని డిస్ క్వాలిఫైడ్ ఎంపీ అని మార్చారు. ఇటీవల తనపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో దానికి నిరసనగా ఆయన ఇలా చేసినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఆయన ప్రొఫైల్ బయోకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇప్పుడు ట్రెండింగ్ లో వుంది. 2019లో కర్ణాటక ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడుతూ… నీరవ్ మోడీ, లలిత్ మోడీ.. ఇలా దొంగలంతా మోడీ ఇంటి పేరు ఎందుకు పెట్టుకుంటారని అన్నారు.
ఆ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. సూరత్ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ, రాహుల్ గాంధీ పై పరువు నష్టం దావా వేశారు. దీనిపై సూరత్ కోర్టు విచారణ చేపట్టింది. తాజాగా ఈ కేసులో ఆయనను దోషిగా సూరత్ కోర్టు నిర్ధారించింది. ఈ మేరకు ఆయనకు రెండేండ్ల జైలు శిక్ష విధించింది.
ఆ వెంటనే ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తీర్పును పై కోర్టులో అప్పీల్ చేసుకు నేందుకు 30 రోజుల పాటు గడువు ఇచ్చింది. ఈ లోగా రాహుల్ లోక్సభ సభ్యత్వాన్ని సచివాలయం రద్దుచేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని 8 వ సెక్షన్ ప్రకారం ఆయనపై అనర్హత వేటు వేసినట్టు ఓ ప్రకటనలో పేర్కొంది.