పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూరత్ జిల్లా కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో ఆయనను దోషిగా ప్రకటించింది. 2019 లో లోక్ సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలోని కోలార్ లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆయన.. ‘దొంగలందరి ఇంటిపేర్లు కామన్ గా మోడీ అనే ఎందుకుంటాయని’ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఆ సందర్భంగా నీరవ్ మోడీ వంటివారి పేర్లను ప్రస్తావించారు.
దీనిపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పూర్ణేశ్ మోడీ ఆయనపై పరువునష్టం దావా వేశారు. రాహుల్ మోడీ సామాజికవర్గాన్ని అవమాన పరుస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కేసుపై విచారణ జరిపిన సూరత్ కోర్టు ఐపీసీ 504 సెక్షన్ కింద రాహుల్ ని దోషిగా ప్రకటించింది.
అయితే తమ నేత ఎవరినీ, ఏ సామాజికవర్గాన్నీ అవమానపరచలేదని కాంగ్రెస్ పార్టీ సమర్థించుకుంది. రాహుల్ కి మద్దతుగా గుజరాత్ లో ఈ పార్టీ నేతలు భారీ పోస్టర్లను ఏర్పాటు చేశారు.
బీజేపీ నియంతృత్వం ముందు తాము తలవంచే ప్రసక్తి లేదని గుజరాత్ పీసీసీ అధ్యక్షుడు ట్వీట్ చేశారు. 2021 అక్టోబరులో కూడా ఈ కేసుకు సంబంధించి రాహుల్ సూరత్ కోర్టుకు హాజరయ్యారు.