జనవరి 18న బీఆర్ఎస్ ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటుచేసింది. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరై ప్రసంగించనున్నారు. ఇదిలా ఉంటే ఖమ్మంలో బీఆర్ఎస్ సభపై కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత..ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో బీఆర్ఎస్ సభ అనేది ఓ ఎంటైర్ టైన్ మెంట్ అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని వారు త్వరలోనే కాంగ్రెస్ లో చేరనున్నారని అన్నారు రేణుకా చౌదరి.
నేను పెట్టిన రాజకీయ భిక్షతో గెలిచిన కొంతమంది బీఆర్ఎస్ లో కాలర్ ఎగరేస్తున్నారని నేను పెట్టిన భిక్షతో గెలిచి రాబందుల్లా తయారయ్యారంటూ విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ఖమ్మంలో బలహీనంగా ఉంది కాబట్టే ఇక్కడ సభ పెడుతున్నారని సీఎం కేసీఆర్ వచ్చి సభలో ప్రసంగించినంత మాత్రాన బీఆర్ఎస్ బలపడదని అన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి తీరుతుందని ఒక్క ఖమ్మం జిల్లాలోనే 10 అసెంబ్లీ సీట్లు, రెండు పార్లమెంట్ సీట్లు గెలిచి మా నాయకురాలు సోనియా గాంధీకి గిఫ్టు గా ఇస్తామని రేణుకా చౌదరి ధీమా వ్యక్తంచేశారు. ఖమ్మం జిల్లా అంటూ కాంగ్రెస్ జిల్లా అని వచ్చే ఎన్నికల్లో నిరూపిస్తామన్నారు. ఖమ్మంలో పార్టీ మారిన నేతల సంగతి చూస్తాం అంటూ హెచ్చరించారు.
ఖమ్మంతోపాటు తెలంగాణలో అన్ని జిల్లాలపైనే ఫోకస్ పెడతామని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ దే గెలుపు అంటూ ధీమా వ్యక్తంచేశారు రేణుకా చౌదరి. ఖమ్మం జిల్లాలోనే 10 అసెంబ్లీ సీట్లు, రెండు పార్లమెంట్ సీట్లు గెలిచి మా నాయకురాలు సోనియా గాంధీకి గిఫ్టు గా ఇస్తామన్నారు. అంతేకాదు ఈ సందర్భంగా ఆమె బీజేపీపై కూడా విమర్శలు చేశారు. బీజేపీ అంటేనే కాంట్రాక్టర్ల పార్టీ అంటూ వ్యాఖ్యానించారు.
కాగా..భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) విస్తరణలో భాగంగా బహిరంగ సభల ఏర్పాటుకు ఆ పార్టీ నాయకత్వం సిద్ధమైంది. తెలంగాణలోనే మొదటి బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ప్రాతిపాదించింది. భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ బహిరంగ సభను ఈనెల 18న ఖమ్మంలో నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరుగనుంది. దీనికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ లను ఆహ్వానించారు.