తెలంగాణలో అత్యాచారాలు పెరిగిపోయాయని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి మండిపడ్డారు. రాష్ట్రంలో పసిపిల్లకు కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు. ఒక్క రోజే ముగ్గురు మైనర్లపై అత్యాచార ఘటనలు వెలుగుచూడడం బాధాకరమన్న ఆమె.. పోలీసులు, షీ టీమ్స్ ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు.
రాష్ట్రంలో పబ్ కల్చర్ పెరిగిందని… ఇష్టం వచ్చినట్లు లైసెన్స్ లు ఇస్తోంది ఎక్సైజ్ శాఖ కాదా అని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ మైనర్ బాలిక కేసును వదిలేది లేదని.. ముఖ్యమంత్రి ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. నగరంలో రక్షణ లేనప్పుడు పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రేణుకా చౌదరి.
బాధితురాలి వివరాలను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బయటపెట్టడం సరైన చర్య కాదని అన్నారు. అత్యాచార బాధితురాలి వివరాలను వెల్లడించడం నేరం చేయడమేనని చెప్పారు. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయడంలో తప్పు లేదన్నారు. రఘునంధన్ రావు ఇన్నోవా వాహనం వీడియో ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు.
రఘునంధన్ సిగ్గుమాలిన ఆరోపణలు చేస్తున్నారని.. పబ్ లో కాంగ్రెస్ నేతల పిల్లలు ఉంటే బయట పెట్టాలని డిమాండ్ చేశారు రేణుకా చౌదరి. బీజేపీ, టీఆర్ఎస్ తోడుదొంగలు, కవల పిల్లల లాంటి పార్టీలని దుయ్యాబట్టారు. ఇక రాష్ట్ర హోంమంత్రి పదవి నుంచి మహమూద్ అలీ తప్పుకోవాలని డిమాండ్ చేశారు రేణుకా చౌదరి.