తమ సమస్యలపై ధర్నా చౌక్ వద్ద టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఎస్ఐ, కానిస్టేబుల్ సమస్యల పరిష్కార పోరాట సమితి నాయకులు వినతి పత్రం అందించారు. తమ సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పోలీస్ ఉద్యోగ నియామకాలపై గతంలోనే ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలిపారు.
మీకు మా యువజన కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. ఏ నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకున్నామో.. ఆ నియామకాల కోసమే మళ్లీ ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ గా తెలంగాణ అధికారి లేడన్నారు. కీలక శాఖలన్నింటిలో తెలంగాణేతరులను నియమించారన్నారు.
మన ప్రాంతంపై ఆ అధికారులకు ప్రేమ, అభిమాననం ఏదీ లేదన్నారు.పరిపాలన అందించడానికి ఏ ఒక్క తెలంగాణ అధికారులకు సమర్ధత లేదా? అని రేవంత్ ప్రశ్నించారు. విద్యార్థుల ప్రాణాలు పోతున్నా ఆ అధికారులకు పట్టింపు లేదని మండిపడ్డారు.
తెలంగాణ అధికారులను, ప్రజలను కేసీఆర్ నమ్మడం లేదు. తెలంగాణ ప్రజల్ని అవమానించేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. నియామకాలు చేపట్టకపోతే కేసీఆర్ ఉద్యోగం ఊడగొట్టడం ఖాయమంటూ ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డి.