ఎ. రేవంత్‌రెడ్డి, లోక్‌సభ సభ్యుడు, మల్కాజ్‌గిరి
ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు గారికి,
విషయం : తెలంగాణ రాష్ట్ర యువజన కమిషన్ ఏర్పాటు గురించి…
తెలంగాణ ఉద్యమ చరిత్రను తరచి చూస్తే అడుగడుగునా యువత పోటాలు, త్యాగాలే కనిపిస్తాయి. పోలీసు తూటాలు-లాఠీలకు ఎదురొడ్డి స్వరాష్ట్ర సాధనలో వారు చూపిన తెగువ ఎప్పటికీ మరపురానిది, ఎన్నటికీ మరువలేనిది. వందల ప్రాణాలు, లక్షలాది యువత త్యాగాలతో స్వరాష్ట్ర స్వప్నం సాకరమైన విషయం కాదనలేని సత్యం.
దురదృష్టం ఏమిటంటే… గడచిన ఐదున్నరేళ్ల మీ పాలనలో యువత ఎన్నడూలేనంత నిర్లక్ష్యానికి గురయ్యారు. ఉద్యోగం రాక, ఉపాధి లేక, భవిష్యత్‌పై ఆశలు ఆవిరై బతుకు వెళ్లదీస్తున్నారు. స్వరాష్ట్రంలో ఇది వారు ఊహించని పరిణామం. ఈ నేపథ్యంలో యువత సమస్యలు, తెలంగాణలో వాస్తవ పరిస్థితులు, తీసుకోవాల్సిన తక్షణ చర్యలను ఈ లేఖ ద్వారా మీ దృష్టికి తెస్తున్నాను.
రాష్ట్రంలో యువత సమస్యల పరిష్కారానికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఓ వేదిక అవసరం. దాని కోసం తెలంగాణ రాష్ట్ర యూత్ కమిషన్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. కమిషన్ ఆవశ్యకత గురించి వివరించడానికి ముందు కేంద్ర కార్మిక-ఉపాధి శాఖ మంత్రివర్యులు సంతోష్ కుమార్ గంగ్వార్ ఇటీవల చేసిన ఒక ప్రకటన మీ దృష్టికి తెస్తున్నాను. దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నైపుణ్య కొరత కారణంగానే ఉద్యోగార్ధులు ఈ అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు అని సదరు మంత్రివర్యులు అభిప్రాయపడ్డారు.
గడచిన ఐదున్నరేళ్ల పాలనలో యువతను మీరు మోసం చేశారు. మీరిచ్చిన హామీలు ఏవీ వాస్తవ రూపం దాల్చలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని పలు సభల్లో ప్రకటించి అధికారంలోకి వచ్చాక మాటమార్చారు. పలు ప్రభుత్వ శాఖల్లో రెండున్నర లక్షల ఉద్యోగ ఖాళీలు ఉండగా, టీఎస్పీఎస్సీ ద్వారా 31 వేలు, ఎస్సై-కానిస్టేబుళ్ల పోస్టులకు సంబంధించి మరో 28 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసి చేతులు దులుపుకున్నారు. మీ తప్పుడు విధానాలు, మోసపూరిత వైఖరిని ప్రశ్నించే యువతను అణగదొక్కారు. సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మీపై యువత ఆగ్రహంగా ఉన్నారన్న విషయాన్ని గ్రహించి మరో మోసపు ప్రకటన చేశారు. తిరిగి గెలిపిస్తే నెలకు రూ.3016 నిరుద్యోగ భృతి ఇస్తామని నమ్మబలికారు. 2019 ఏప్రిల్ ఒకటి నుండి ఈ పథకం అమలులోకి వస్తుందని ఆర్భాటపు ప్రకటనలు చేశారు. ఆరు నెలలు కావస్తున్నా ఈ పథకం కింద అర్హులను గుర్తించడం కానీ, విధివిధానాలు ఖరారు చేసిన దాఖలాలు కానీ లేవు.
ప్రస్తుతం రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్టు ఒక అంచనా. ప్రతి ఏటా 1.25 లక్షల మంది పట్టభద్రులు చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగ, ఉపాధి వేటలో దిగుతున్నారు. వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన వారిని కూడా కలిపితే ఈ సంఖ్య రెండు లక్షలపై చిలుకు ఉంటుంది. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం చూసినా 14 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు.
నిరుద్యోగ సమస్యకు సంబంధించి కేంద్ర పరిధిలోని నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) ఇటీవల విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం దేశంలోని 22 రాష్ట్రాల్లో తెలంగాణకు ఐదో స్థానం దక్కింది. మన రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఈ సర్వే వివరాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ దేశానికే ఆదర్శం అని మీరు ఢంకా బజాయించి చెబుతుంటారు. కానీ, నిరుద్యోగ సమస్య తీవ్రత విషయంలో బీహార్, జమ్ము-కాశ్మీర్, కేరళ, ఒడిస్సా తర్వాత స్థానం మన రాష్ట్రానికే దక్కడం సిగ్గుచేటు.
ఈ నేపథ్యంలో తక్షణం యువశక్తిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మన యువతలో నైపుణ్యాలు మెరుగుపరిచి, వారికి సరైన దిశానిర్ధేశం చేస్తే ఏదైనా సాధించగలరు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై వారికి మార్గనిర్దేశం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దురదృష్టం…ఆ విషయంలో మీరు పూర్తిగా విఫలం అయ్యారు.
యువత సమస్యల పై మేథోమథనం జరగాలి, సమస్యలకు పరిష్కారాలు వెతకాలి, వారికి సరైన మార్గనిర్దేశం జరగాలి, విద్య,ఉద్యోగ,ఉపాధి విషయంలో దిశానిర్దేశం చేసే పరిస్థితి రావాలి. దీని కోసం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఓ వేదిక కావాలి.
అందుకే… తక్షణం తెలంగాణ స్టేట్ యూత్ కమిషన్ ఏర్పాటు చేస్తూ శాసనసభలో బిల్లు పెట్టండి. బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లు ఆమోదించి, చట్టం తేవాలని డిమాండ్ చేస్తున్నాను. తద్వారా కొంత మేరకైనా తెలంగాణ యువతకు మేలు జరుగుతుందన్నది నా ఆకాంక్ష.